తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ఐపియల్ క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్ మరియు క్రికెట్ బెట్టింగ్‌లపై జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ప్రకాశం, మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు మరియు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, తమ తమ పరిధిలోని హోటళ్లు, డార్మెంటరీ, టీ దుకాణాలు, బార్లు, హాస్టళ్లు, ఎల్ఈడి స్క్రీన్‌లు ఉన్న షాపులు మరియు ఇతర ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో గోప్యంగా నిర్వహించే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్,గేమ్స్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా గుంపులుగా కూడే ప్రదేశాల్లో వ్యక్తుల మొబైల్ ఫోన్లను పరిశీలిస్తూ, క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించిన వివిధ యాప్‌ల వినియోగంపై తనిఖీలు చేపట్టారు. ఎవరైనా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు గుర్తించినట్లయితే, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. అలాగే, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారు, ప్రోత్సహించే వారు లేదా మధ్యవర్తులుగా వ్యవహరించే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ఐపియల్ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైను, ఆఫ్లైను క్రికెట్ బెట్టింగులకు పాల్పడేవారు, ముఖ్యంగా యువత అప్రమత్తం ఉండాలని, ఆర్ధికంగా జీవితాలను నాశనం చేసే బెట్టింగు యాప్ లు జోలికి పోవద్దని ప్రజలకు, యువతకు సూచించారు. ప్రజలందరూ క్రికెట్‌ను కేవలం ఒక క్రీడగా ఆస్వాదించాలి కానీ బెట్టింగ్ మాయలో పడకూడదన్నారు. చిన్న మొత్తాలతో ప్రారంభమైన బెట్టింగ్, చివరకు అన్నీ కోల్పోయే స్థాయికి తీసుకెళ్తుందన్నారు. గతంలో బెట్టింగ్ లకు పాలపడిన వారిపై, అనుమానితులపై నిఘా ఉంచామని, ఆన్ లైన్/ ఆఫ్లైను ద్వారా బెట్టింగ్ కు పాల్పడినా, గుంపులు గుంపులుగా కూర్చుని సెల్ చూస్తూ బెట్టింగ్స్ వేస్తున్న అలాంటి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ లు జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 112/100 కు (లేదా) సంబంధిత పోలీస్ అధికారులకు కాల్ చేసి సమాచారం అందించాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *