తొలి శుభోదయం ప్రకాశం:-
సమాజంలో శాంతిభద్రతలు పరిరక్షించడం, ప్రజలకు సురక్షితమైన మరియు శుభ్రమైన వాతావరణం కల్పించాలనే ముఖ్య లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు, మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రదేశాలపై విస్తృత స్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ చర్యల్లో భాగంగా మద్దిపాడు ప్రాంతంలో ఓపెన్ బూజింగ్కు కేంద్రాలుగా మారిన ప్రదేశాలను గుర్తించి, అక్కడ మద్యం సేవించే కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి, ఆ ప్రదేశాలను శుభ్రపరిచారు. బహిరంగ మద్యపానం వల్ల కుటుంబాల్లో కలిగే సమస్యలు, యువతపై పడే దుష్ప్రభావాలు, మహిళలు మరియు పిల్లలకు కలిగే అసౌకర్యాలు, అలాగే చట్టపరమైన శిక్షలు గురించి స్థానిక ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.బహిరంగ మద్యపానం సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు దారితీస్తుందని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా నిరంతర నిఘా, కఠిన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. ఓపెన్ బూజింగ్కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు బహిరంగ మద్యపానానికి దూరంగా ఉండాలని, తమ పరిసరాల్లో ఇలాంటి కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శాంతియుత, క్రమశిక్షణ గల సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో భద్రతా భావన పెరిగిందని, మద్దిపాడు ప్రాంతాన్ని మరింత ప్రశాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు.