తొలి శుభోదయం ప్రకాశం:-

రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణ భద్రతను కాపాడే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో, ఎస్‌ఐ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి రోడ్డు భద్రతపై కట్టుదిట్టమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారు, సీటుబెల్ట్ ధరించని కార్ డ్రైవర్లు, అధిక వేగంతో వాహనాలు నడిపే వారు, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి, రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రాణ నష్టం, కుటుంబాలపై పడే ప్రభావం గురించి అవగాహన కల్పించారు. అవసరమైన చోట చట్టపరమైన చర్యలు కూడా చేపట్టారు.ప్రజల ప్రాణాలు అమూల్యమైనవని, చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని పోలీసులు వాహనదారులకు స్పష్టంగా వివరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, రోడ్డు భద్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు.రోడ్డు భద్రతపై అవగాహనతో పాటు కట్టుదిట్టమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా ప్రమాదాలను తగ్గించడమే ఈ ప్రత్యేక డ్రైవ్ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *