తొలి శుభోదయం ప్రకాశం :-
తుఫాను నేపథ్యంలో, తేదీ 28.10.2025 రాత్రి సుమారు 7:45 గంటల సమయంలో నూతలపాటి కోటయ్య (తండ్రి: ఏయాతి, వయసు: 25 సంవత్సరాలు), పచ్చవ గ్రామం, జరుగుమల్లి మండలం వాసి, కందుకూరు నుండి పచ్చవ గ్రామానికి వెళ్తుండగా, పొన్నలూరు–ఉప్పలదిన్నె మార్గంలో తన బజాజ్ పల్సర్ బైక్ పై వాగు దాటే ప్రయత్నం చేశాడు. అయితే, వాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో బైక్ వాగులోనే ఆగిపోయి, కోటయ్య వాగులో కొట్టుకుపోయాడు.ఆ సమయంలో ఆయన వాగు పక్కన ఉన్న వేపచెట్టును పట్టుకుని రాత్రంతా అక్కడే గడిపాడు. బుధవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఒక వ్యక్తి పొన్నలూరు పోలీస్ స్టేషన్కు వచ్చి — “వాగులో ఎవరో కాపాడండి, కాపాడండి అంటూ అరుస్తున్నారు” అని సమాచారం ఇచ్చాడు.దాంతో వెంటనే పొన్నలూరు రైటర్ చెన్నకేశవులు, టిఏ నాగేశ్వరరావు వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గ్రామస్తుల సహాయంతో తాళ్లు చెప్పించి, ఈతగాళ్లను పిలిపించి వాగులోకి దింపారు. ఆ వ్యక్తిని వాగు నుండి సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చి, ఆర్ఎంపీ డాక్టర్ కి చూపించి, అనంతరం అతని బంధువులకు అప్పగించారు.