75 వసంతాలు పూర్తి చేసుకున్న 14 మంది రిటైర్డ్ పోలీస్ అధికారులు, సిబ్బందిని సన్మానించిన జిల్లా ఎస్పీ
దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించిన రిటైర్డ్ పోలీసుల అనుభవాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం: జిల్లా ఎస్పీ
విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి: జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం ప్రకాశం:-
పోలీసు శాఖలో సుదీర్ఘ కాలంపాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బంది మరియు అధికారులకు ప్రకాశం జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంఘం 6వ వార్షికోత్సవం సందర్భంగా పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రిటైర్డ్ పోలీసులలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 14 మంది పోలీస్ అధికారులను మరియు వారి కుటుంబ సభ్యులను ఎస్పీ గారు శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో ఎస్పీ మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు విధులు చాలా కష్టంతో కూడుకున్నవని, పోలీసులు విధి నిర్వహణలో వారి ఆరోగ్య ప్రాధాన్యత కంటే ప్రజా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధతతో విధులు నిర్వర్తించారని వారిని ఎస్పీ ప్రశంసించారు. గతంలో సాంకేతిక పరిజ్ఞానం లేదని అయినప్పటికీ అనేక ముఖ్యమైన దొంగతనం, దోపిడీ, హత్య కేసులు మరియు కీలక కేసులు సేదించడంలో ఎంతో నైపుణ్యత కనపరిచారన్నారు. సుదీర్ఘకాలంపాటు నిస్వార్థంగా సేవలు అందించినందుకు వారికి పోలీసు శాఖ తరపున ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల, సిబ్బంది అనుభవాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని అన్నారు. రిటైర్డ్ పోలీసులను సన్మానించడం ఒక మంచి కార్యక్రమామని, ఇలాంటివి ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా విశ్రాంత ఉద్యోగులంతా గొప్ప సత్సంబంధాలతో మెలిగి ఉండడమే కాక క్రియాశీలక పోలీసులతో కూడా మమేకమయ్యేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. విశ్రాంత పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం కృషి చేస్తానని, వారికి ఎలాంటి సమస్య ఉన్న సహాయం కావాలన్నా జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం విశ్రాంత పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ ని శాలువతో సన్మానించి, మెమెంటోలను అందచేసినారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
