తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
స్థానిక కనుమళ్లలోని మలినేని సుశీలమ్మ మహిళల ఇంజినీరింగ్ కళాశాలలో “విహంగ్ 2026” పేరుతో జాతీయ స్థాయి టెక్నో-కల్చరల్ మరియు క్రీడా ఉత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది. దేశం నలుమూలల నుండి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డీజీపీ డా. మాలకొండయ్య హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువతలో సృజనాత్మకత, క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందేందుకు ఇలాంటి ఉత్సవాలు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొని, సాంకేతిక పరిజ్ఞానం సమాజాభివృద్ధికి కీలకమని తెలిపారు.ప్రత్యేక అతిథులుగా లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు, లా ఎక్సలెన్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ మరియు ఐడీపీఎస్ కార్యదర్శి డా. పి. రాంబాబు, ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఒంగోలు డైరెక్టర్ డా. ప్రకాశ్ చావల పాల్గొని విద్యార్థులకు మార్గదర్శక ప్రసంగాలు అందించారు. కళాశాల చైర్మన్ డా. మాలినేని పెరుమాళ్లు కూడా తన ప్రసంగంలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ, విద్యతో పాటు సాంస్కృతిక మరియు క్రీడా కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు.ఈ ఫెస్టివల్లో టెక్నికల్ ఈవెంట్స్గా పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్ వంటి పోటీలు, కల్చరల్ ఈవెంట్స్గా నృత్యం, మైమ్, అలాగే క్రీడా విభాగంలో ఖో-ఖో, కబడ్డీ పోటీలు నిర్వహించబడ్డాయి. విజేతలకు మొత్తం రెండు లక్షల రూపాయల వరకు నగదు బహుమతులు ప్రకటించారు.సాయంత్రం నిర్వహించిన సంగీత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రసిద్ధ గాయకులు ప్రవీణ్ కుమార్ కొప్పోలు మరియు ఐశ్వర్య తమ అద్భుత గానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడం, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం, క్రీడా స్పూర్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించిన “విహంగ్ 2026” ఉత్సవం కళాశాల ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు మరియు అతిథులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
