తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నివారణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, Sky Eye Prakasam ప్రాజెక్ట్‌లో భాగంగా ఒంగోలు రైల్వే స్టేషన్లో డ్రోన్ సర్వైలాన్స్ నిర్వహించారు.ఈ డ్రోన్ నిఘా కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, ప్లాట్‌ఫారాలు, ట్రాక్‌ల చుట్టుపక్కల ప్రాంతాలను గాలిలో నుంచే పరిశీలించి, అనుమానాస్పద కదలికలు, భద్రతా లోపాలు ఉన్నాయా లేదా అన్న అంశాలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తనిఖీ చేశారు. రైల్వే ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకునే దిశగా ఈ నిఘా ఉపయోగపడిందని పోలీసులు తెలిపారు.డ్రోన్ సాంకేతికత ద్వారా పెద్ద పరిధిలో తక్కువ సమయంలో సమగ్ర నిఘా సాధ్యమవుతుందని, నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు భద్రతాభావం కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని పోలీసులు పేర్కొన్నారు. ఒంగోలు పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో ఇలాంటి డ్రోన్ సర్వైలాన్స్ను మరింత విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు.ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.