తొలి శుభోదయం న్యూస్ కంభం:-
మార్కాపురం జిల్లా కంభం మండలంలోని తురిమెళ్ళ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్లస్టర్ పరిధిలోని అన్ని పాఠశాలలు మంగళవారం “బడి పిలుస్తుంది” విద్యా వారోత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. క్లస్టర్ చైర్మన్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ర్యాలీ సందర్భంగా తురిమెళ్ల గవర్నమెంట్ హైస్కూల్ నుండి గ్రామ ప్రధాన వీధుల గుండా బడిబాట నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ బోధన వంటి సదుపాయాలను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలల ఔన్నత్యాన్ని చాటిచెప్పారు.
ఈ సందర్భంగా క్లస్టర్ చైర్మన్ మొయినుద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని, గ్రామంలోని బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ బడిలోనే చేర్చేలా తల్లిదండ్రులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదనీ, అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యా కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, గ్రామ పెద్దలు, తల్లితండ్రులు,పాఠశాలల బాలబాలికలు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.