సరైన పత్రాలు లేని 29 మోటార్‌సైకిళ్లను 5 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు దర్శి డిఎస్పీ బి. లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో అద్దంకి టౌన్‌లోని గరటయ్య కాలనీ పరిసర ప్రాంతంలో విస్తృత స్థాయిలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, అద్దంకి సీఐ సుబ్బరాజు, ఎస్సైలు మరియు 38 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ పరికరాల ద్వారా అనుమానితుల తనిఖీ చేశారు.తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లు, దుకాణాలు, ఇతర ప్రదేశాలను సోదాలు చేశారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 29 మోటార్‌సైకిళ్లు, 5 ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొందరు వాహన యజమానులకు చలానాలు విధించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, కొత్త చట్టాలు, మహిళలపై నేరాలు మరియు వాటి శిక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.తదనంతరం “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో స్థానిక ప్రజలతో కలిసి గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. యువత, వ్యాపారులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని “గంజాయిని పారదోలుదాం – డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడుదాం” అంటూ ప్రతిజ్ఞ చేశారు.దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గంజాయి మరియు మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, ఉపాధి వంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్డాన్ సెర్చ్ లో బల్లికురవ ఎస్సై నాగరాజు,సంతమాగులూరు ఎస్సై పట్టాభి రావు, కొరిశపాడు ఎస్సై సురేష్, కె.కె. మెట్ల ఎస్సై రఫీ, తాళ్లూరు ఎస్సై మల్లికార్జున, దొనకొండ త్యాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
