మెనూ సక్రమంగా పాటించాలని ఉపాధ్యాయులకు సూచన
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు మండలం మాచవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులు, సౌకర్యాలు నిశితంగా పరిశీలించారు. మినరల్ వాటర్ ప్లాంట్ సామర్థ్యం, మెనూ అమలు, బియ్యం ఇతర స్టాక్ వివరాలను గమనించారు. అలాగే విద్యార్థులతో మాట్లాడి, మధ్యాహ్న భోజనం సక్రమంగా పెడుతున్నారా లేదా, రుచి మరియు నాణ్యత ఎలా ఉంటుంది అని అడిగి తెలుసుకున్నారు. నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. పరీక్షలు బాగా రాస్తున్నారా అని అడుగుతూ… వారికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరావు… ఇన్చార్జ్ హెచ్ఎం మరియు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ మెనూ సక్రమంగా అమలు చేయాలని సూచించారు. పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అలాగే స్కూల్ భవనం స్లాబ్ అక్కడక్కడా దెబ్బతిని ఉండడాన్ని ఎమ్మెల్యే గమనించి, వెంటనే పరమతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కందుకూరు మండల టిడిపి మాజీ అధ్యక్షులు నార్నే రోశయ్య, స్థానిక నాయకులు చిరంజీవి రెడ్డి ఉన్నారు.
