తొలి శుభోదయం ప్రకాశం :-
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా లాడ్జిలు, హోటళ్లు, గెస్ట్ హౌస్లు, లాడ్జింగ్ సెంటర్లు మొదలైన చోట్ల పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో లాడ్జిల్లో తాత్కాలికంగా బస చేసే వ్యక్తుల వివరాలు, వారి గుర్తింపు పత్రాలు (ID proofs), లాడ్జి రిజిస్టర్లో నమోదు ఉన్న ఎంట్రీలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లు, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు వంటి అంశాలను పూర్తిగా పరిశీలించారు.అదేవిధంగా, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడం, రిజిస్టర్లో సరైన వివరాలు నమోదు చేయకపోవడం, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించకపోవడం వంటి లోపాలు ఉన్న లాడ్జి యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు.పోలీసులు మాట్లాడుతూ —
“ప్రజల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యం. జిల్లాలో నేరాలు జరుగకుండా ముందస్తు చర్యలలో భాగంగా లాడ్జిలు, హోటళ్లలో ఈ రకమైన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. ప్రతి లాడ్జి యజమాని తమ వద్ద బస చేసే వ్యక్తుల పూర్తి వివరాలను రికార్డు చేయడం తప్పనిసరి. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు పాల్గొన్నారు.
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.
