తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో మహిళల భద్రతకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా దర్శి, కొండేపి, ముండ్లమూరు, కందుకూరు టౌన్,గుడ్లూరు,మేదరమెట్ల,వివిపాలెం, ఒంగోలు టూ టౌన్, నాగులప్పలపాడు, లింగసముద్రం, ఉలవపాడు మరియు పలు పోలీస్ స్టేషన్ లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని సందర్శించిన విద్యార్థినిలకు పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించే విధులు, మహిళా సహాయ కేంద్రం సేవలు, పోలీసుల పనితీరు, వారు ఉపయోగించే పరికరాలు, పలు రికార్డుల నిర్వహణ, కొత్త చట్టాలు తదితర విషయాలపై వివరించారు. మహిళలకు సంబంధించిన చట్టాలు, ఫోక్సో చట్టం, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సామాజిక మాధ్యమాల వినియోగం మరియు సైబర్ క్రైమ్‌లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఒంగోలు రూరల్ సీఐ శేషగిరి రావు మాట్లాడుతూ బాలికలు తప్పనిసరిగా స్వీయ రక్షణ నైపుణ్యాలను అలవరుచుకోవాలని, ఎదుటివారి నుండి తమను తాము రక్షించుకునే విధానాలను నేర్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం మనం టెక్నాలజీ యుగంలో ఉన్నందున సైబర్ భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. స్మార్ట్ మొబైల్ ఫోన్లను అవసరానికి మించి ఉపయోగించవద్దని, అనధికారిక యాప్స్ డౌన్‌లోడ్ చేయకూడదని, మొబైల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు. మొబైల్ ఫోన్లను అధికంగా ఉపయోగించడం వల్ల సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉందని తెలియచేసారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన బాలికలందరూ మంచిగా చదువుకుని సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని సూచించారు. పోలీస్ శాఖ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఎల్లవేళలా పోలీస్ సిబ్బంది సహాయం, సహకారం అందుబాటులో ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు.అదే విధంగా పలు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు మరియు సిబ్బంది విద్యార్థినిలకు అవగాహన కల్పించారు.మహిళలు/చిన్నారులకు అత్యవసర సమయంలో సహాయం కొరకు హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేసి పోలీసులు సహాయం పొందాలన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్:1098, ఉమెన్ హెల్ప్ లైన్:181,పోలీస్ హెల్ప్ లైన్:100 / 112, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్:1930, పోలీస్ కంట్రోల్ రూమ్: 9121102266 తెలియజేశారు.