తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం &. మార్కాపురం :-
జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ముందస్తుగా భారీ పోలీస్ బందోబస్తును మోహరించారు.పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేసి, గుంపులుగా నిలబడకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేయించగా, అనుమానితులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. సివిల్ మరియు ఏఆర్ పోలీస్ బలగాలతో నిరంతర పహారా నిర్వహిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు.“విద్యార్థుల ప్రశాంతతే మా ప్రాధాన్యత” అనే నినాదంతో పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు పరీక్షా కేంద్రాల వద్ద శాంతి భద్రతలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.