శ్రీ వివేకానంద హై స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహణ
తొలి శుభోదయం సింగరాయకొండ:-
శ్రీ వివేకానంద హై స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు కరస్పాండెంట్ కాకుమాని మాల్యాద్రి ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో ఈరోజు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో శ్రీమతి డి.జయమణి గారు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, క్షమ, త్యాగాలకు ప్రతీక అని పేర్కొన్నారు. యేసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకమని, విద్యార్థులు క్రమశిక్షణ, మానవత్వం, పరస్పర గౌరవం వంటి విలువలను జీవితంలో అలవర్చుకోవాలని సూచించారు. చిన్న వయసులోనే మంచి గుణాలు అలవర్చుకుంటే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని ఆమె తెలిపారు.కార్యక్రమంలో విద్యార్థులు క్రిస్మస్‌కు సంబంధించిన పాటలు, నాటికలు, ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. యేసు క్రీస్తు జన్మకథను వివరిస్తూ ప్రదర్శించిన నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల ప్రదర్శనలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రశంసించారు.కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇలాంటి వేడుకలు విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలు, సామాజిక చైతన్యం పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్య అతిథికి పాఠశాల యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలిపి అనంతరం శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
