తొలి శుభోదయం న్యూస్ కంభం:-

కంభం: జన గణన కార్యక్రమం ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం లక్ష్యంగా కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్విజ్, ఎస్సే రైటింగ్, డిబేట్ పోటీలలో విజేతలకు బహుమతి పతకాలను అందించారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ ద్వితీయ, తృతీయ స్థానాల్లో రాణించిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి శ్రీ అబ్దుల్ సత్తార్ గారి చేతులమీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ గారు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి, కార్యనిర్వహణలో జనగణన ఎంత ముఖ్యమో విద్యార్థులకు వివరించారు. ప్రతి వ్యక్తి వివరాలు సక్రమంగా నమోదు కావడం ద్వారా ప్రభుత్వానికి పథకాల అమలు సులభమవుతుందని చెప్పారు.
అలాగే విద్యార్థులకు “స్వీయ గణన” (Self Enumeration) విధానం గురించి అవగాహన కల్పించారు. డిజిటల్ విధానంలో తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసే విధానాన్ని సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ఈ ప్రక్రియలో ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం అత్యంత అవసరమని సూచించారు. అనంతరం పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరైన విద్యార్థులను ఎంపిక చేసి, ప్రోత్సహించేందుకు ఉపాద్యాయులు ఎం.మారుతీ రెడ్డి గారు ప్రత్యేక బహుమతులు అందజేశారు. చదువుపై ఆసక్తిని పెంపొందించుకుంటూ,క్రమశిక్షణ అలవాటు చేసుకోవడంలో హాజరు ఎంతో ముఖ్యమని, ప్రతిరోజూ పాఠశాలకు హాజరవడం ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను పూర్తిగా అర్థం చేసుకోవడమే కాకుండా, మంచి ఫలితాలు సాధించగలరని ఆయన వివరించారు.
ఈ విధమైన ప్రోత్సాహక కార్యక్రమాలు విద్యార్థుల్లో హాజరు శాతం పెరగడానికి దోహదపడుతుందని ఎంఈఓ శ్రీ అబ్దుల్ సత్తార్ గారు, ఉపాద్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు.తదుపరి వేసవి సెలవులలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉపాధ్యాయులు సత్య రామారావు గారు, వీరనారాయణ గారు మాట్లాడుతూ పలు జాగ్రత్తలను సూచించారు. సంవత్సరం పాటు నేర్చుకున్న విద్యాంశాలను పునఃశ్చరణ చేసుకుంటూ, చదవడం,వ్రాయడం లాంటి నైపుణ్యాలను పెంపొందించుకునేలా అభ్యాసం చేయాలన్నారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *