క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, ఒంగోలు టౌన్ డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు వన్‌టౌన్, టూ టౌన్, తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు మరియు సిబ్బంది మొత్తం 11 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తమ తమ పరిధిలోని టీ షాపులు, బార్లు, హాస్టళ్లు మరియు ఇతర ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో గోప్యంగా నిర్వహించే ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడింది. ఈ తనిఖీలలో భాగంగా గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో వ్యక్తుల మొబైల్ ఫోన్లను పరిశీలించి, క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించిన వివిధ యాప్‌ల వినియోగంపై తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు గుర్తించినట్లయితే, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. అలాగే, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారు, ప్రోత్సహించే వారు లేదా మధ్యవర్తులుగా వ్యవహరించే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ T20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైను, ఆఫ్లైను క్రికెట్ బెట్టింగులకు పాల్పడేవారు, ముఖ్యంగా యువత అప్రమత్తం ఉండాలని, ఆర్ధికంగా జీవితాలను నాశనం చేసే బెట్టింగు యాప్‌ల జోలికి పోవద్దని ప్రజలకు, యువతను ఒంగోలు డిఎస్పీ సూచించారు. ప్రజలందరూ క్రికెట్‌ను కేవలం ఒక క్రీడగా ఆస్వాదించాలి కానీ బెట్టింగ్ మాయలో పడకూడదన్నారు. మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో, ఏ ఆటగాడు ఎంత స్కోరు చేస్తాడో, ఏ బౌలర్ వికెట్లు తీయగలడో అంటూ చిన్న మొత్తాలతో ప్రారంభమైన బెట్టింగ్, చివరకు అన్నీ కోల్పోయే స్థాయికి తీసుకెళ్తుందన్నారు. గతంలో బెట్టింగ్ లకు పాలపడిన వారిపై, అనుమానితులపై నిఘా ఉంచామని, ఆన్ లైన్/ ఆఫ్లైను ద్వారా బెట్టింగ్ కు పాల్పడినా, గుంపులు గుంపులుగా కూర్చుని సెల్ చూస్తూ బెట్టింగ్స్ వేస్తున్న అలాంటి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కనుక ఎవరూ కూడా కష్టపడకుండా వచ్చే నగదుకు ఆశపడి బెట్టింగ్ రాయుళ్ల చేతుల్లో చిక్కుకోవద్దని, మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఒంగోలు డిఎస్పీ సూచించారు. ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ లు జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 112/100 కు (లేదా) సంబంధిత పోలీస్ అధికారులకు కాల్ చేసి సమాచారం అందించాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.ఈ తనిఖీలో ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు,ఒంగోలు తాలూకా సీఐ విజయ్ కృష్ణ,8 మంది ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
