తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ నందు శిక్షణ పొందుతున్న విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతిపై విచారణ వేగవంతం చేయాలని కోరుతూ మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కవ్వొత్తులతో శనివారం రాత్రి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ వద్దగల అంబేద్కర్ విగ్రహం నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. అనంతరం తహసిల్దార్ జయలక్ష్మి కి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ… సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ నందు విద్యార్థి అనుమానాశ్రయం స్థితిలో మృతి చెంది పది రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు సరియైన విచారణ చేపట్టలేదని అన్నారు. జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. విద్యార్థి తౌషిక్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.