ట్రాక్టర్లు, ఆటోలు, గూడ్స్ వాహనాలపై ప్రత్యేక దృష్టి నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా తీసుకొని, ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధుల్లో పోలీసు అధికారులు మరియు సిబ్బంది వాహనదారులకు రోడ్డు మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు.వాహనదారులు ట్రాక్టర్ల డోర్లు బయటికి తీసి వాటిపై కూలీలను కూర్చోబెట్టుకొని రహదారులపై ప్రయాణించడం వలన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, పగలు,రాత్రి సమయాల్లో కర్రలతో నిండిన ట్రాక్టర్లు రహదారులపై వెడల్పుగా ప్రయాణించడం వల్ల ఇతర వాహనదారులకు అవగాహన లేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అదే విధంగా ఆటోల్లో అధిక లోడ్‌తో ప్రయాణికులను తీసుకెళ్లడం, వెనుక డోర్ తీసి ప్రయాణికులను కూర్చోబెట్టడం, డ్రైవర్ పక్కన నియమాలకు విరుద్ధంగా అదనపు వ్యక్తులను కూర్చోబెట్టడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయన్నారు. గూడ్స్ వాహనాల్లో(ట్రక్కు ఆటోలు, ట్రాక్టర్స్) ప్రయాణికులను తీసుకెళ్లడం కూడా చట్ట విరుద్ధమై, ప్రమాదాలకు కారణమవుతోందన్నారు. రహదారి నియమాలను పాటించకుండా రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించి, జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. వాహనదారులు రాత్రి సమయంలో స్పష్టంగా కనిపించే విధంగా తమ వాహనాలకు రేడియం స్టికర్లు తప్పనిసరిగా అంటించుకోవాలని సూచించారు.ప్రమాదాల నివారణ దిశగా పోలీసు అధికారులు అవగాహన సమావేశాలు నిర్వహిస్తూ, నిబంధనలు పాటించకపోవడం వల్ల కలిగే నష్టాలను వివరంగా తెలియజేస్తున్నారు. ట్రాక్టర్లు, ఆటోలు, గూడ్స్ వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా నడిపినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలి. వాహనానికి సంబంధించిన పత్రాలు (డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ మొదలైనవి) వెంట ఉంచుకోవాలి. మద్యం సేవించి వాహనం నడపరాదు. ట్రాఫిక్ మరియు రోడ్డు నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *