తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల శాంతి భద్రతలు, సామాజిక క్రమశిక్షణ మరియు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం పోలీసులు జిల్లా వ్యాప్తంగా ‘ఓపెన్ బూజింగ్’ ప్రదేశాల శుభ్రత కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అలగాయపాలెం రైల్వే గేట్ ప్రాంతం, కందుకూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పెర్నమిట్ట శివారు ప్రాంతాలు మరియు రల్లపాడు ప్రాజెక్ట్ పరిసరాల్లోని మద్యం అడ్డాలను స్థానిక ప్రజల సహకారంతో పోలీసులు పూర్తిగా శుభ్రపరిచారు. అలాగే మార్కాపురం పట్టణంలో కూడా మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ మద్యపాన ప్రదేశాలపై ఉక్కుపాదం మోపుతూ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమాలను స్థానిక తాలూకా మరియు మార్కాపురం టౌన్ ఎస్ఐల పర్యవేక్షణలో నిర్వహించి, అక్కడ పేరుకుపోయిన ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, బహిరంగ మద్యపానం కేవలం చట్టవిరుద్ధమే కాకుండా సామాజిక భద్రతకు, ముఖ్యంగా మహిళల రక్షణకు ముప్పుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా సమాజంలో మార్పు సాధ్యం కాదని, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు ఇలాంటి డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, అనుమానిత సమాచారాన్ని వెంటనే డయల్ 112 కు అందించాలని ప్రజలను కోరారు.