తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-

దేశ యువత భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారుతున్న మాదకద్రవ్యాల పట్ల చైతన్యం కలిగించే లక్ష్యంతో, భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో “వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్” ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘దండి మార్చి 2.0’ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ సోమవారం తమ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో మహాత్మా గాంధీ దేశ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు చేపట్టిన ‘దండి మార్చి’ తరహాలోనే, నేడు డ్రగ్స్ అనే మహమ్మారిని అరికట్టడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశాన్ని ముందుకు నడిపించే మహా శక్తి యువతని, ఆ యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసైతే దేశ భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు
పోలీస్ శాఖకు సహకరిస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న ‘దండి మార్చి 2.0’ కార్యక్రమాన్ని విద్యార్థులు, యువత, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు. 100 మీటర్ల పొడవైన జాతీయ పతాకంతో వేలాది మంది విద్యార్థులతో నిర్వహించే ఈ భారీ ర్యాలీతో పాటు మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞా కార్యక్రమం ప్రజల్లో గొప్ప స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యతని, ఇలాంటి సామాజిక చైతన్య కార్యక్రమాలకు పోలీస్ శాఖ తరపున పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.ఈ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో బాపట్ల ఈగిల్ సెల్ సిబ్బంది, రోజు ఆర్గనైజేషన్ అధ్యక్షులు పొందుగుల ప్రసాద్, శ్రీ భావపురి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఆవుల వెంకటేశ్వర్లు, మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి గురజాల శ్రీనివాసరావు, ఎం. జాకబ్, ఆర్.టి.ఐ. ఉపాధ్యక్షులు పి. ప్రసాద్, పలువురు ఎన్‌జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *