మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కృషి చేయాలి.
పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు న్యాయం అందేవిధంగా చూడాలి
రోడ్డు ప్రమాదాల సంఖ్యను ఇంకా తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
డ్రంక్ అండ్ డ్రైవ్ ,ఓపెన్ డ్రింకింగ్, మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక దృష్టి సారించాలి
గంజాయి వంటి మాదక ద్రవ్యాల అనర్ధాలపై,సైబర్ నేరాలు, రోడ్డు భద్రతలపై ప్రజల్లో విరివిగా అవగాహన కల్పించాలి
ఎన్ఫోర్స్మెంట్ను పెంచి చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి:జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక కార్యచరణతో ప్రణాళికా బద్ధమైన చర్యలు తీసుకుంటూ, ప్రతి ఒక్క పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేసి జిల్లాలో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పేలా కృషి చేయాలని మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారు అన్నారు. జిల్లా డీఎస్పీ, సీఐలు, ఎస్సైలతో బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎస్పీ ముఖ్యంగా అపరిష్కృతంగా ఉన్న కేసులలో సమగ్ర దర్యాప్తు చేసి, మహిళా సంబంధిత నేరాల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట సమయం లోపల బాధితులకు న్యాయం అందించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మహిళలకు సంబంధించిన ఏ విషయమైనా సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించే విషయంలో అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
నాన్‌బెయిలబుల్ వారెంట్లు ఉన్న వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని సూచించారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకుని ప్రాపర్టీ రికవరీ శాతాన్ని పెంచాలని, దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్, నైట్ బీట్స్ బలోపేతం చేసి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
పిల్లలకు వేసవి సెలవుల సందర్భంగా మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టుతూ, ఈత రాని వారు చెరువులు, కుంటలు, వాగుల్లోకి దిగకుండా తల్లిదండ్రులు మరియు ప్రజలు తగిన అవగాహన కల్పించాలన్నారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని, మలుపులు, జంక్షన్లు, టి.జంక్షన్,వై జంక్షన్, యు టర్న్, విజిబిలిటీ తక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించిన ప్రాంతాల్లో అదనంగా హెచ్చరిక బోర్డులు,కుంభాకార దర్పణాలు, ప్రతిబింబించే స్ట్రిప్స్ (Reflective Strips), వేగ పరిమితి సూచనలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్య ప్రాంతాలలో పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై ఇంకా విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలో చెడునడతగల వ్యక్తులు, పాతముద్దాయిలపై నిఘా పెట్టాలని, ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ పెంచాలని, పేకాట ,మట్కా గంజాయి, కోడి పందాలు పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, అసాంఘిక,చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. గ్రామ సందర్శనలు చేసి ఎక్కడైనా గ్రామాలలో గొడవలు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
సైబర్ నేరాలు,గంజాయి వంటి మాదక ద్రవ్యాల అనర్థాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ,కొత్త చట్టాలు, శిక్షలు, బాల్య వివాహాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కెమెరాల యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేసి ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, వై.పాలెం సీఐ కె.అజయ్ కుమార్, కంభం సీఐ మల్లికార్జున రావు,గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, గిద్దలూరు అర్బన్ సురేష్, త్రిపురాంతకం సీఐ అస్సన్, ఎస్సైలు పాల్గొన్నారు.
