తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండం చర్ల గ్రామానికి చెందిన దూదేకుల పెద్ద పీరమ్మ (80 సంవత్సరాలు, w/o లేట్ కాశయ్య) వృద్ధాప్యం చేత మంచానికి పరిమితమై ఉండగా, ఆమెను కోడలు దూదేకుల బీజమ్మ పట్టించుకోకపోవడం, తరచూ దురుసుగా ప్రవర్తించడం, కుమారుడు దూదేకుల కాసిం పీరా కూడా సకాలంలో చూసుకోకపోవడం వల్ల ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు గ్రామస్తులు “మీకోసం” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన వెంటనే జిల్లా ఎస్పీ స్పందించి, పెద్దారవీడు ఎస్సై వి. సాంబశివయ్య కి వెంటనే వృద్ధురాలు ఉన్న చోటుకు వెళ్లి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.పెద్దారవీడు పోలీస్ స్టేషన్ ఎస్సై వి. సాంబశివయ్య గుండం చర్ల గ్రామానికి వెళ్లి వృద్ధురాలు పెద్ద పీరమ్మను కలిసారు. ఆమె సమస్యలను పూర్తిగా తెలుసుకుని, ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్న కోడలు బీజమ్మకు మరియు కుమారుడు కాసిం పీరాకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది. వృద్ధులను సంరక్షించడం కుటుంబ సభ్యుల బాధ్యత అని వారికి హెచ్చరికలు జారీ చేశారు. సీనియర్ సిటిజన్ రక్షణ చట్టాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని వారికి తెలియజేశారు. కౌన్సిలింగ్ అనంతరం వృద్ధురాలి కొడుకు, కోడలు ఇకమీదట ఆమెను జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇచ్చారు.వృద్ధురాలి సమస్యలను తీర్చేందుకు ముందుకు వచ్చిన జిల్లా ఎస్పీ గారి మానవీయ ధోరణిని స్ధానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.వృద్ధులు, మహిళలు, చిన్నారులపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా చర్యలు తీసుకుంటామని, అలాగే శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.