టెక్నాలజీని నిత్యం ఫాలో అవ్వండి
పొదుపు గ్రూపులను మరింత బలోపేతం చేయాలని సూచన
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో… కందుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల వివోఏ లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరగగా…. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.179 మందికి ఫోన్లు అందజేశారు.
ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ…రాష్ట్రంలో పొదుపు గ్రూపులకు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారని, అప్పటినుంచి మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా రుణాలు అందిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఒక్కొక్క గ్రూపుకు గరిష్టంగా 20 లక్షలు వరకు బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయన్నారు.
గతంలో రుణాలు తీసుకున్న మహిళలు… పాడిపరిశ్రమ కోసం వాటిని ఉపయోగించుకునే వారని, ప్రస్తుతం వ్యాపారాల మీద దృష్టి పెట్టి మంచి భవిష్యత్తు సంపాదించుకుంటున్నారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు.
వివోఏలు ప్రతి మహిళను పొదుపు గ్రూపుల్లో చేర్చే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. వారిలో చైతన్యాన్ని కలిగించాలన్నారు.
గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కులు వాటాలు కల్పించారని ఎమ్మెల్యే గుర్తుచేస్తూ… చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా గ్రూపుల ఏర్పాటుతో మహిళలకు అండగా నిలిచారని అన్నారు. అలాగే స్థానిక సంస్థల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించారని చెప్పారు. ప్రస్తుతం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఆమోదం పొందబోతోందని, ఇది మహిళామూర్తులు సాధించిన విజయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రోజురోజుకు మారుతున్న టెక్నాలజీ పై విఏవోలు అవగాహన పెంచుకొని విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, తద్వారా నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, ఇంచార్జ్ ఎంపీడీవో ఓబులేసు,
కందుకూరు మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మేడికొండ కెజియా, ఉలవపాడు అధ్యక్షురాలు సుగుణమ్మ, ఏపిఎంలు సింహాద్రిరావు, సురేష్, కృష్ణయ్య, చినబాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.