తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కందుకూరు డీఎస్పీ గారి పర్యవేక్షణలో కొండపి పట్టణంలో “ఆపరేషన్ వజ్ర పహార్”లో భాగంగా విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. అంబేద్కర్ కాలనీ, బాబు జగ్జీవన్ కాలనీ మరియు ఇతర ఎస్సీ కాలనీలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ ఆపరేషన్లో భారీగా పోలీసు బలగాలు పాల్గొని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.కొండపి సీఐ ఆధ్వర్యంలో కందుకూరు టౌన్, మర్రిపూడి, పొన్నలూరు పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది సమన్వయంతో పాల్గొని ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడి చేసి, అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాలను ఆపి పత్రాలు పరిశీలించడంతో పాటు, గుర్తింపు లేని వ్యక్తుల వివరాలను నమోదు చేశారు. నేరాలకు పాల్పడే అవకాశమున్న వ్యక్తులపై నిఘా పెంచి, శాంతి భద్రతలను బలోపేతం చేసే చర్యలు చేపట్టారు.పోలీసులు ఈ సందర్భంగా ప్రజలకు చట్టపరమైన అవగాహన కల్పిస్తూ, గంజాయి, మట్కా, గ్యాంబ్లింగ్, కోడి పందాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజల సహకారం కీలకమని తెలిపారు.అదేవిధంగా “ఆపరేషన్ వజ్ర పహార్”లో భాగంగా కొండపి పట్టణంలో పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లను కొనసాగిస్తామని తెలిపారు.
