మాదకద్రవ్యాల నిర్మూలనతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన ర్యాలీ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఆపరేషన్ “వజ్రప్రహార్” లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు దర్శి డిఎస్పీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో అద్దంకి టౌన్ సీఐ సుబ్బరాజు, రూరల్ సీఐ మల్లికార్జున రావు, 6 మంది దర్శి సబ్ డివిజన్ ఎస్సైలు 44 మంది సిబ్బందితో పాటు,పోలీస్ జాగిలం కలిసి శనివారం ఉదయం మేదరమెట్ల గాంధీనగర్‌లో వజ్ర ప్రహర్ ఆపరేషన్ (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహించారు. తనిఖీలు ముఖ్యంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లు, దుకాణాలు, ఇతర ప్రదేశాలను తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 40 మోటార్‌సైకిళ్లు లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తదనంతరం “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో స్థానిక ప్రజలతో కలిసి గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. యువత, వ్యాపారులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని “గంజాయిని పారదోలుదాం – డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడుదాం” అంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీసి కుటుంబ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు.దర్శి డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా తనిఖీలు నిర్వహించామన్నారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సరైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఒకసారి తప్పు దారిలోకి వెళ్లితే వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబాలు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం విద్య, ఉద్యోగ అవకాశాలు, కుటుంబ అభివృద్ధి మరియు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, మంచి భవిష్యత్తు కోసం విద్య, క్రీడలు మరియు ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమన్నారు.మాదకద్రవ్యాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” కింద ఇలాంటి ప్రత్యేక చర్యలు నిరంతరం కొనసాగుతాయని ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రదేశాలలో నిర్వహించారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.