తొలి శుభోదయం న్యూస్ పోలీస్ :-
ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్రమ్ హై స్కూల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు తాలూకా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో నిర్వహించి, సైబర్ నేరాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పిల్లల హక్కులపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులకు ఇంటర్నెట్ వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, తెలియని వ్యక్తుల నుండి వచ్చే కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లపై అప్రమత్తంగా ఉండడం గురించి వివరించారు. సైబర్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో సూచనలు ఇచ్చారు.అలాగే గుడ్ టచ్–బ్యాడ్ టచ్ పై స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద పరిస్థితుల్లో భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. పిల్లల హక్కులు, వారి భద్రతపై చట్టాలు, సహాయ వనరుల గురించి కూడా వివరించారు.విద్యార్థులు చదువుతో పాటు తమ భద్రతపై కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్య ఎదురైనా పోలీసులను సంప్రదించడానికి వెనుకాడవద్దని తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
