తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ఐపీఎస్.బ్రిటిష్ పాలనలోని ఆగడాలకు ఎదురొడ్డి అలుపెరగని సాయుధ పోరాటం చేసిన మహావీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ కొనియాడారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లా ఎస్పీ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1857 తొలి భారత స్వాతంత్ర్య సమరానికి పదేళ్ల ముందే బ్రిటిష్ దుష్టపాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసిన ధైర్యవంతుడు నరసింహారెడ్డి అని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన పాలెగాడు కుటుంబంలో జన్మించిన ఆయన, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రైతులపై విధించిన అధిక పన్నులు, అన్యాయ విధానాలకు వ్యతిరేకంగా 1846 జూన్‌లో పోరాటం ప్రారంభించి, కోయిలకుంట్ల ఖజానాపై దాడి చేసి బ్రిటిష్ అధికారాన్ని సవాలు చేశారని తెలిపారు.వేలాది అనుచరులతో కలిసి బ్రిటిష్ దళాలకు ఎదురు నిలిచిన ఆయనను చివరకు అరెస్టు చేసి, న్యాయ విచారణ అనంతరం 1847 ఫిబ్రవరి 22న కోయిలకుంట్లలో బహిరంగంగా ఉరితీయడం జరిగినదని వివరించారు. ఆయన త్యాగం భారత స్వాతంత్ర్య చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిందని, దేశభక్తి, ధైర్యం, ఆత్మగౌరవానికి ఆయన జీవితం నిదర్శనమని ఎస్పీ పేర్కొన్నారు.ప్రస్తుతం యువత దేశభక్తి భావనతో సమాజానికి సేవ చేయాలని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ద్వారా జాతీయ స్పూర్తిని పెంపొందించుకోవాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *