తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా లాడ్జీలు, డార్మిటరీస్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. “పోలీసుల భరోసా – ప్రజల రక్షణ” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో అనుమానాస్పద కార్యకలాపాలను అరికట్టడం ప్రధాన లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు.ఈ తనిఖీలలో భాగంగా లాడ్జీల్లో ఉండే అతిథుల నమోదు వివరాలు, ఐడెంటిటీ ప్రూఫ్‌లు, సీసీ కెమెరాల వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. రిజిస్టర్ నిర్వహణ సక్రమంగా ఉందా లేదా, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే విషయాలను ప్రత్యేకంగా తనిఖీ చేశారు.లాడ్జి యజమానులకు ప్రతి అతిథి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, సరైన గుర్తింపు పత్రాలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలిస్తూ, భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు.ఇలాంటి ప్రత్యేక తనిఖీల ద్వారా నేరాలను అరికట్టడమే కాకుండా, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.ప్రజలు పోలీసులకు సహకరించి, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా పనిచేస్తున్నారని తెలిపారు.