తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు డి.ఎస్.పి ఆర్. శ్రీనివాసరావు గారి అధ్వర్యంలో ఒంగోలు టు టౌన్ సీఐ యం.శ్రీనివాసరావు, ఒంగోలు సబ్ డివిజన్ 8 మంది ఎస్సైలు , 42 మంది పోలీస్ సిబ్బంది ఒంగోలు టౌన్ లోని బాలాజీ నగర్ మరియు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం‘ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇళ్లు, దుకాణాలు, పాత ముద్దాయిల నివాసాల్లో సోదాలు నిర్వహించారు.సరైన పత్రాలు లేని 12 బైక్ లు, 6 ఆటో లు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, ప్రజలు గంజాయి సహా అన్ని రకాల మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసైతే వ్యక్తి ఆర్థికంగా, కుటుంబపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తి తన చర్యలపై నియంత్రణ కోల్పోయి అనేక అనర్థాలకు గురయ్యే ప్రమాదం ఉందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలు అక్రమ రవాణా, విక్రయదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల కాల్స్‌కు స్పందించి ఓటీపీలు చెప్పవద్దని హెచ్చరించారు.
అలాగే ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, ఆధార్ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పే మోసగాళ్లను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి, ప్రజలతో కలిసి “మత్తుకు దూరంగా ఉండాలి – మత్తు లేని సమాజాన్ని నిర్మిద్దాం” అనే ప్రతిజ్ఞ చేయించారు.
గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా డయల్ 112 లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9121102266 తెలియజేయాలని ప్రజలను కోరారు.
