తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణ అభివృద్ధిని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేను చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటన నేడు రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ అనూష మరియు ఇతర అధికారులతో కలిసి 13వ వార్డులోని బండపాలెం, రామ్ నగర్, ఆనందపురం రోడ్డు, 14వ వార్డులోని శ్రీనగర్ కాలనీ, అలాగే 16వ వార్డులోని అజ్మల్ హుస్సేన్ హాస్పిటల్ మరియు ముళ్ళపాలెం ప్రాంతాల్లో పర్యటించి, ప్రతి వీధిని, ప్రతి కాలువను పరిశీలించాను. పర్యటనలో భాగంగా కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండటం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం మరియు కాలువలు పూడిపోవడాన్ని గమనించి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాను. ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తున్నప్పుడు వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులకు స్పష్టం చేశాను.పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై స్థానికులు వ్యక్తం చేసిన అసహనంపై తక్షణమే స్పందిస్తూ, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి కనీసం పది రోజులకు ఒకసారి ప్రతి కాలువను తప్పనిసరిగా శుభ్రం చేయాలని ఆదేశించాను. అలాగే, కాలువలపై ఉన్న ఆక్రమణలు, అక్రమ మెట్లును తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించాను. 16వ వార్డులో దశాబ్దాల క్రితం నిర్మించిన శిథిలమైన కాలువలను పరిశీలించి, వాటి స్థానంలో రోడ్ల ఎత్తుకు అనుగుణంగా కొత్త కాలువలు నిర్మించేందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్‌కు సూచించాను..