తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

భూగర్భ జలాలు అత్యంత తక్కువగా ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చెరువుల్లో పూడికతీత పనులు యజ్ఞంలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. గురువారం ఎర్రగొండపాలెం పట్టణంలో జల ధార -జల హారతి కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాగునీటి కాలువలు, చెక్ డ్యాములు, చెరువులను సాగుకు అనుకూలంగా మార్చుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అధికారులతో పాటు సాగునీటి సంఘాల అధ్యక్షులు, దాతలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ముందుకు రావాలన్నారు. జిల్లా మొత్తానికి 13 కోట్ల నిధులు కేటాయించగా ఒక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి 9 కోట్లు నిధులు కేటాయించడం ఈ ప్రాంత దుస్థితిని తెలియజేస్తుందని కలెక్టర్ వివరించారు. మే నెల చివరి నాటికి ఈ కార్యక్రమంలో పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎర్రగొండపాలెం తెదేపా ఇంచార్జి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచేందుకు ఒక లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి కార్యక్రమాలను అందరి సకారంతో విజయవంతం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం నీటి నిల్వ సంరక్షణను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. నియోజకవర్గంలోని 115 చెరువులను బాగు చేసుకుని నీటి నిల్వ చేసుకుంటే భవిష్యత్తులో సమస్య రాదని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, ఇరిగేషన్ ఎస్ ఈ అబూతలిం, ఇతర అధికారులు పాల్గొన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *