బైకులకు అధిక శబ్దం చేసే మాడిఫైడ్ సైలెన్సర్ల 100, అనధికార లైటింగ్ 400 లను రోడ్ రోలర్ తో ధ్వంసం
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు మీ భద్రతకే…ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలి: జిల్లా ఎస్పీ
సురక్షిత ప్రయాణానికి ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలి: జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఒంగోలు టౌన్లో శబ్ద కాలుష్యం నియంత్రణతో పాటు రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా అమలు చేయాలనే లక్ష్యంతో గత నాలుగు నెలలుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన అధిక శబ్దం చేసే 100కు పైగా మాడిఫైడ్ సైలెన్సర్లను తొలగించారు.అదేవిధంగా, ద్విచక్ర వాహనాలు మరియు ఆటోలకు ప్రభుత్వం అనుమతించిన ప్రమాణాలకు విరుద్ధంగా అధిక కాంతి వెలువరించే అనధికార లైటింగ్ అమర్చడం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు స్పష్టంగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి 400కు పైగా హెడ్లైట్లను తొలగించారు.తొలగించిన మాడిఫైడ్ సైలెన్సర్లు మరియు హెడ్లైట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్థన్ రాజు, ఐపీఎస్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మోటార్ వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తూ కంపెనీ తయారీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం చేసే సైలెన్సర్లను ఉపయోగించే వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ఒంగోలు టౌన్లో డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఒంగోలు టౌన్ సీఐలు, ట్రాఫిక్ సీఐ ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల శబ్ద కాలుష్యం కొంతమేర తగ్గిందన్నారు. అదే విధంగా ఎల్ఈడి లైట్లపై కూడా చర్యలు తీసుకున్నామని తెలిపారు.బైకులకు కంపెనీలు నిర్దేశించిన సైలెన్సర్లను తొలగించి ఇతర సైలెన్సర్లను అమర్చడం వల్ల శబ్ద, గాలి కాలుష్యం పెరుగుతుందని, ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా అధిక కాంతి వెలువరించే లైట్లు లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా అమర్చడం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హైవేపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం, ఓవర్‌టేకింగ్ సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం వంటి చర్యలు ప్రమాదాలకు దారి తీస్తాయని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బైకులకు విపరీత శబ్దాన్నిచ్చే సైలెన్సర్ అమర్చుకుని శబ్ద కాలుష్యం సృష్టిస్తే చట్టపరమైన చర్యలు జరుగుతుందని, వాహనాలకు మాడిపైడ్ సైలెన్సర్లను విక్రయించే షాపుల యజమానులు, వాటిని బిగించే మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి డ్రైవ్‌లు కొనసాగుతాయని, మాడిఫైడ్ సైలెన్సర్లను ఉపయోగించవద్దన్నారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు, ఏ ఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్ జగదీష్, ఒంగోలు తాలూకా సిఐ విజయ్ కృష్ణ, ఆర్ఐ సీతారామరెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐలు కోటయ్య, శ్రీనివాసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.
