స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు.వైఎస్ఆర్‌సీపీ నాయకులతో కలిసి నెల్లూరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఆయన, ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు, అరెస్టులు, నిర్బంధాలు జరగకుండా చూడాలని, పోలీసు–రెవెన్యూ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేయడం, పోలీస్ స్టేషన్లకు పిలిపించడం వంటి పరిణామాలపై కలెక్టర్‌కు వివరించినట్లు తెలిపారు.
ఓటర్ల జాబితాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలిఓటర్ల జాబితాల తయారీ, సవరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలని కోరారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా, అనర్హుల పేర్లు చేర్చబడకుండా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులు, నిర్బంధాలు లేదా బెదిరింపులకు పాల్పడితే వైఎస్ఆర్‌సీపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. ఇటీవల వైఎస్ఆర్‌సీపీ నాయకులపై జరుగుతున్న అరెస్టులతో పాటు తమ పార్టీ నాయకులపై అభ్యంతరకరమైన భాష ప్రయోగిస్తున్న అంశాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.పోలింగ్ రోజున కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
పోలింగ్ రోజున ఎలాంటి దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాలు లేదా అధికార దుర్వినియోగానికి అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.“నెల్లూరులో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని అధికారులు కల్పించాలి. అధికారంలో ఎవరు ఉన్నా చట్టం అందరికీ సమానంగా అమలు కావాలి” అని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసి, చట్టపరంగా పోరాడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *