– న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-

పేద మహిళలకు న్యాయం పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ మహిళ కూడా న్యాయానికి దూరం కాకూడదని న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.సార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో కార్మిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మత్స్యశాఖల సమన్వయంతో నిర్వహిస్తున్న శ్రింప్ సినర్జీ ప్రాజెక్టులో భాగంగా టంగుటూరు పరిధిలోని సంధ్య ఆక్వా రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంధ్య ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఇన్‌చార్జి శ్రీనివాసులు, న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, రెడ్‌క్రాస్ ప్రతినిధి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మహిళా కార్మికులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, పని ప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి చట్టపరమైన మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళల ఆరోగ్యం, భద్రత, గౌరవం, పని ప్రదేశాల్లో రక్షణకు సంబంధించిన చట్టపరమైన అంశాలను వివరించారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్హులైన మహిళలు ఉచిత న్యాయసహాయం పొందవచ్చని తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేని మహిళలు, ముఖ్యంగా మహిళా కార్మికులు, తమకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. అర్హతలు, వర్తించే నిబంధనల ప్రకారం ఉచిత న్యాయసలహా, న్యాయప్రతినిధ్యం వంటి సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.మహిళలపై గృహహింస, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, వేతనాల చెల్లింపులో సమస్యలు, ఇతర హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి బాధితులు భయపడకుండా సంబంధిత అధికారులను, న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని ఆయన సూచించారు. న్యాయం పొందడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదని, మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించడం ద్వారా వారి హక్కులను పరిరక్షించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ ప్రతినిధి శ్రీనివాసులు మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడటానికి సి. పి.ఆర్. కార్డిపుల్మనరీ రెసుసైటేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నప్పుడు లేదా సాధారణంగా శ్వాస తీసుకోలేనప్పుడు, అత్యవసర వైద్య సహాయం వచ్చేలోపు పరిస్థితిని బట్టి సి.పి. ఆర్ ఎలా అందించాలో కార్మికులకు అవగాహన కల్పించారు. అనంతరం CPR చేసే విధానాన్ని ప్రాక్టికల్‌గా ప్రదర్శించి, కార్మికులతో కూడా అభ్యాసం చేయించారు. అత్యవసర సమయాల్లో భయపడకుండా స్పందించడం, వెంటనే వైద్య సహాయం కోరడం, ప్రాథమిక ప్రాణరక్షణ చర్యలపై అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరమని సూచించారు.పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు చట్టప్రకారం అవసరమైన చోట అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయడం, ఫిర్యాదులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం ముఖ్యమని జెండర్ ఎక్స్‌పర్ట్ సంధ్య వివరించారు. మహిళా కార్మికులు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేసే వాతావరణాన్ని యాజమాన్యాలు కల్పించాలని పేర్కొన్నారు.కౌన్సెలర్ బాషా మాట్లాడుతూ, కార్మికులకు అందుబాటులో ఉన్న సామాజిక భద్రతా పథకాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, వాటి ప్రయోజనాలు, అర్హతల గురించి వివరించారు. అర్హులైన కార్మికులు ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమానికి సార్డ్స్ సిబ్బంది చిన్న కోటయ్య అధ్యక్షత వహించారు. సంధ్య ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఇన్‌చార్జి శ్రీనివాసులు, సూపర్‌వైజర్లు, సార్డ్స్ సిబ్బంది, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ కార్మికులు, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *