తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:-

కింగ్ జార్జి ఆసుప‌త్రిలో కార్డియో థొరాసిక్ & వాస్క్యులర్ సర్జరీ (CTVS) విభాగం ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కార్డియాల‌జీ విభాగంలో ఐసీఐసీఐ బ్యాంకు ఫౌండేష‌న్ అందించిన స‌మారు రూ.2 కోట్ల ఆర్థిక స‌హాయంతో ఏర్పాటు చేసిన హార్ట్ లంగ్ మిష‌న్, హీమోథ‌ర్మ్ ను మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రా మెడిక‌ల్ కాలేజీలో కార్డియాలజీ విభాగం 1995–98 కాలంలో ప్రారంభమై, 2000కు ముందే ఓపెన్ హార్ట్ సర్జరీలు ప్రారంభమవడం గొప్ప చారిత్రాత్మక అంశమని గుర్తుచేశారు. అయితే హార్ట్ లంగ్ మెషిన్ పాడైపోవడంతో కొంతకాలం ఇబ్బందులు ఎదురైనప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే వంశీ ద్వ‌రా సమస్య తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సానుకూలంగా స్పందించి ఐసీఐసీఐ బ్యాంకు వారిని సంప్ర‌దించ‌గా, వారు సీఎస్సార్ ద్వారా హార్ట్ లంగ్ మెషిన్‌ను విరాళంగా అందజేయడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం కార్డియాలజీ విభాగంలో రెగ్యులర్‌గా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని తెలిపారు. క్యాథ్ ల్యాబ్ అప్‌గ్రేడేషన్‌ను కూడా సీఎస్సార్ ద్వారా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై స్పష్టమైన దృష్టితో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. సంజీవ‌ని ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడంతో పాటు హెల్త్ అలర్ట్స్ ద్వారా ప్రాణాలు కాపాడే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ కింద కవరేజ్ లేని చికిత్సలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థికంగా అండగా ఉంటున్నామని గుర్తు చేశారు. కార్పొరేట్ సంస్థలు పేదల కోసం ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. గతంలో డయాలసిస్ యూనిట్లు వంటి సదుపాయాలు కూడా విరాళాల ద్వారా కేజీహెచ్ లో అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. త్వరలోనే క్యాథ్ ల్యాబ్‌ను కూడా అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు.ప్రస్తుతం కేజీహెచ్ లో బైపాస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని, అవసరమైతే గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేసే సదుపాయం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల గుండె చప్పుడుగా, ప్రాణ రక్షక కేంద్రంగా కేజీహెచ్ నిలుస్తోందన్నారు. కార్డియో థొరాసిక్ విభాగంలో మహిళా వైద్యులు అధికంగా ఉండటం విశేషమని, వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల ఐసీఐసీఐ ఫౌండేషన్ సహకారంతో ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయడంతో పాటు, రెండు కొత్త ఆపరేషన్ థియేటర్లు ప్రారంభించబడ్డాయి. దీని ద్వారా మరింత ఎక్కువ మంది పేద మరియు ఆర్థికంగా బలహీన వర్గాల రోగులకు సేవలు అందుతున్నాయ‌ని మంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ‌ కింద ప్రతి నెల సుమారు రూ.25 నుంచి 30 లక్షల విలువైన శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తున్నార‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్, ఉత్త‌ర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్ర‌స్టు ఛైర్మ‌న్ సీతంరాజు సుధాక‌ర్, ఐసీఐసీఐ బ్యాంకు ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు శివ కుమార్ చిట్టిపోలు, శ్రీవ‌ర్ధ‌న్ బోబెప‌ల్లి, ప‌క్కి వెంక‌ట సాయి శంక‌ర్, ఎం. ర‌జ‌నీకాంత్ రెడ్డి, కేజీహెచ్ అడ్మినిస్ట్రేట‌ర్ బి.వి. ర‌మ‌ణ‌, సూప‌రింటెండెంట్ ఐ. వాణి, ఇత‌ర వైద్యాధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *