తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం జిల్లా మద్దిపాడు:-
రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు వ్యవసాయ అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి చెప్పారు. శుక్రవారం మద్దిపాడులో నిర్వహించిన 2025 – 26 సంవత్సర జిల్లాస్థాయి ‘ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ‘ మూడవ విడత నిధుల జమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్.పి.రాజాబాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు .బి.ఎన్.విజయకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ ముప్పవరపు సుచిత్ర, పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ జయంతి బాబు, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గోపీచంద్, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, స్థానిక ఏఎంసి చైర్ పర్సన్ రాజేశ్వరి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రధానమంత్రి .నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి .నారా చంద్రబాబు నాయుడి ప్రసంగాలను ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద జిల్లాలోని రైతులకు ఈ ఏడాది మూడు విడతలలో కలిపి రూ.471.34 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. ఈనాము భూ సమస్యలను పరిష్కరిస్తామని, విత్తనాలు, ఎరువులు, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటి అన్ని విషయాలలో
రైతులకు అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో వంటగ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయంలో మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
