తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

స్థానిక టీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) వేదికగా శనివారం జాతీయ సేవా పథకం (NSS) యూనిట్-1 మరియు యూనిట్-2 విభాగాల ఆధ్వర్యంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు “వాటర్ పాజిటివ్ ఆంధ్ర” అనే ప్రధాన ఇతివృత్తంతో నీటి పరిరక్షణ మరియు జల వనరుల సంరక్షణపై విద్యార్థులకు, సమాజానికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.ఏడుకొండలు నరేంద్ర మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభా, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే తరాలకు నీటి కరువు లేకుండా చూడాలంటే ప్రతి ఇంటిలోనూ, ప్రతి విద్యా సంస్థలోనూ నీటిని ఒడిసిపట్టే వ్యవస్థలు ఉండాలని సూచించారు. వాటర్ పాజిటివ్ ఆంధ్ర అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, అది ఒక సామాజిక బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. ఐ.క్యూ.ఏ.సి (IQAC) కోఆర్డినేటర్ డా.పి.రాజ గోపాల్ బాబు మాట్లాడుతూ, నీటి వృధాను అరికట్టడంలో విద్యార్థులు రాయబారులుగా పనిచేయాలని కోరారు. కళాశాల ప్రాంగణంలో ఉన్న సహజ వనరులను కాపాడుకోవడం ద్వారా మనం పర్యావరణ సమతుల్యతను కాపాడగలమని వివరించారు. అనంతరం విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుతూ నీటి పొదుపుపై రూపొందించిన వివిధ అవగాహన పోస్టర్లను ప్రదర్శించారు. ఈ పోస్టర్ల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయడం, కలుషిత నీటిని శుద్ధి చేయడం మరియు నీటి వినియోగంలో పొదుపు పాటించడం వంటి అంశాలను చక్కగా వివరించారు. ఇందులో భాగంగా ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు క్షేత్రస్థాయిలో శ్రమదానం చేపట్టారు. కళాశాల ఆవరణలో ఉన్న ఇంకుడు గుంతలను శుభ్రం చేసి, వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకున్నారు. అలాగే కళాశాలలోని ఆక్వాటిక్ పాండ్‌ను (జల కుంట) శుద్ధి చేసి, దాని పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. వ్యవసాయ రంగంలో నీటి వినియోగాన్ని తగ్గించే డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) పద్ధతులపై కళాశాలలోని మియావాకి నగరవనంలో ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా విద్యార్థులకు ప్రయోగాత్మక అవగాహన కల్పించారు. డ్రిప్ పైపుల నిర్వహణ, వాటిని శుభ్రం చేసే విధానం మరియు తక్కువ నీటితో మొక్కలను ఎలా పెంచవచ్చో ప్రత్యక్షంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ యూనిట్-1 కోఆర్డినేటర్ కోటపాటి నరేష్ రాజా, యూనిట్-2 కో-ఆర్డినేటర్ డా. కె. పద్మావతి, కళాశాల జంతు శాస్త్ర విభాగం, సీనియర్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *