ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 33 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
ప్రజా ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ శ్రీ యు. నాగరాజు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదిదారులతో పోలీసులు ముఖాముఖిగా సమావేశమై, వారి సమస్యలను విని సవివరంగా వివరాలు తెలుసుకున్నారు.కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ సంబంధిత మరియు ఆన్లైన్ మోసాలు, భూ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఫిర్యాదిదారులు స్వేచ్ఛగా వినిపించారు. పోలీసు అధికారులు ప్రతి ఫిర్యాదును సవివరంగా పరిశీలించి, సానుకూలంగా స్పందించి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుని బాధితులకు త్వరితగతిన న్యాయం అందిస్తామని భరోసా కల్పించారు.
సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో మాట్లాడి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మీకోసం కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో వై.పాలెం సీఐ కె.అజయ్ కుమార్, పొదిలి ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్, త్రిపురాంతకం సీఐ అస్సన్, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.