తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
బాపట్లను బాల కార్మిక రహిత జిల్లాగా చేయాలని డి ఆర్ ఓ జి.గంగాధర్ గౌడ్ తెలిపారు. బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. బాల కార్మికులను నిర్మూలించడానికి ప్రభుత్వం నియమించిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు బాధ్యతతో పనిచేయాలని డిఆర్ఓ చెప్పారు. జిల్లాలో బాల కార్మికులు లేకుండా చేయాలన్నారు. 14 సంవత్సరాలలోపు పిల్లలందరూ ఖచ్చితంగా పాఠశాలల్లోనే ఉండాలన్నారు. ముఖ్యంగా పరిశ్రమలు, ఇటుక బట్టీలు, హోటల్స్, దాబాల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. పట్టణ ప్రాంతాలలోనూ దుకాణాలు, వాణిజ్య సముదాయాలలో మున్సిపల్ కమిషనర్లు తనిఖీలు చేపట్టాలన్నారు. గడిచిన రెండు నెలల్లో రెండు కేసులు నమోదు కావడంతో బాలలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అధికారులు సమర్ధంగా పనిచేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని వివరించారు.ఈ సమావేశంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ వెంకట శివప్రసాద్, డిపిఓ ప్రభాకర్ రావు, డి ఆర్ డి ఎ పీడీ బి.సింగయ్య, డ్వామా పిడి విజయలక్ష్మి, కమిటీలోని వివిధశాఖల జిల్లా అధికారులు, వీక్షణ సమావేశం ద్వారా ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.