తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో వాహనదారులు ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్. ఒక ప్రకటనలో సూచించారు. ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల ప్రాంతాల్లో వాహనదారులు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరమన్నారు.వాహనాన్ని నడిపే ముందు అన్ని టైర్ల పరిస్థితిని పరిశీలించడం తప్పనిసరి అని, టైర్లలో గాలి, పాత లేదా దెబ్బతిన్న టైర్లను వెంటనే మార్చుకోవాలని సూచించారు. అలాగే వాహనం యొక్క ఇంజిన్ కండిషన్ సరిగా ఉందో లేదో ముందుగానే చెక్ చేయడం ద్వారా ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు.ఎండాకాలంలో ఇంజిన్ వేడెక్కే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, రేడియేటర్‌లో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని, కూలింగ్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తుందో లేదో చూసుకోవడం ద్వారా వాహనం ఓవర్‌హీట్ కావడం నివారించవచ్చని తెలిపారు. ఎక్కువ దూరం ప్రయాణాలు చేసే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రత్యేకంగా 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిదని, ఈ విరామ సమయంలో వాహనాన్ని మళ్లీ చెక్ చేసుకోవాలని సూచించారు. డ్రైవర్‌లు అలసటకు గురికాకుండా ఉండేందుకు ఈ విరామాలు చాలా అవసరమని తెలిపారు. అలసటతో డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.అలాగే ప్రయాణ సమయంలో తగినంత నీరు తీసుకోవడం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం కూడా ముఖ్యమని సూచించారు. అవసరమైతే ప్రయాణాన్ని ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ప్లాన్ చేసుకోవడం ద్వారా ఎండ తీవ్రతను తగ్గించుకోవచ్చని తెలిపారు. వాహనదారులు ఈ సూచనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవడంతో పాటు, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పనిచేస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు. రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, రాంగ్ డైరెక్షన్‌లో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలకు దారితీస్తుందన్నారు.అలాగే అతివేగంగా వాహనాలను నడపకూడదని, రోడ్డు/ట్రాఫిక్ నియమాలను పాటించాలని, డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకూడదని, సీటుబెల్ట్ ధరించడం తప్పనిసరి అన్నారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రజల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *