తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సమాజ అభివృద్ధికి విద్యే మూలాధారం. అయితే గిరిజన ప్రాంతాల్లోని అనేక మంది విద్యార్థులు ఇప్పటికీ పేదరికం, సామాజిక వెనుకబాటుతనం, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలతో పోరాడుతూ విద్యను అభ్యసిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువుకు ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని తాతయ్య గిరిజన కాలనీ పాఠశాల విద్యార్థులకు రిటైర్డ్ వ్యవసాయ శాఖ ఇంజనీర్ గుర్రాల ఇస్సాక్ రాజభూషణం సహకారంతో న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు నోటు పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల విద్యార్థులు అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ చదువుకుంటున్నారని, వారి తల్లిదండ్రులు ఎక్కువగా కూలీ పనులు, వ్యవసాయ ఆధారిత ఉపాధిపై ఆధారపడటం వల్ల విద్యా అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నారని అన్నారు. అలాంటి విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు వంటి ప్రాథమిక విద్యా సామగ్రి కూడా కొన్నిసార్లు అందుబాటులో ఉండదని పేర్కొన్నారు.విద్యా సంవత్సరం ప్రారంభంలో కొత్త నోటు పుస్తకాలు, స్టేషనరీ అందించడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, పాఠశాలకు హాజరు కావాలనే ఆసక్తి మరింత పెరుగుతుందని చెప్పారు. చిన్న సహాయం కూడా ఒక విద్యార్థి జీవితంలో పెద్ద మార్పుకు నాంది కావచ్చనని పేర్కొన్నారు.గిరిజన మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య అందించడం ద్వారా మాత్రమే సమాజంలో సమాన అవకాశాలు కల్పించగలమని అన్నారు.పాఠశాల ఉపాధ్యాయుని కత్తి మాధురి మాట్లాడుతూ, విద్యార్థులకు అందించిన ఈ సహాయం వారి చదువుకు ఎంతో ఉపయోగపడుతుందని, సమాజంలోని దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలను, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల పాఠశాలలను దత్తత తీసుకొని సహకరించాలని కోరారు అదేవిధంగా దాత గుర్రాల ఇస్సాక్ రాజభూషణంకు కృతజ్ఞతలు తెలిపారు.