తొలి శుభోదయం కందుకూరు:-

టెక్నికల్ కోర్సులు నేర్చుకోండి
ఉద్యోగాలకు ఢోకా ఉండదు
యువతకు సూచించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు
కందుకూరు పారిశ్రామిక హబ్ గా మారబోతోంది
పెద్దపెద్ద పరిశ్రమలు రాబోతున్నాయి
మన ప్రాంతం నుంచి ఇక వలసలు ఉండవు
ఏపీకి చంద్రబాబు గారే పెద్ద ఆస్తి
యువతరం ఆలోచనలు మారాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు రోజురోజుకీ టెక్నాలజీ పరంగా వస్తున్న పెను మార్పులను గమనిస్తూ విద్యార్థులు అప్డేట్ కావాలని, అందుకు సంబంధించిన కోర్సులపై పట్టుసాధిస్తే భవిష్యత్తు బాగుంటుందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, కందుకూరులోని శ్రీ గాయత్రీ విద్యా పరిషత్ డిగ్రీ కళాశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహించగా, ఎమ్మెల్యే నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరావు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, ఫార్మా లాంటి రంగాల వైపు యువత దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా టెక్నికల్ కోర్సులు నేర్చుకుంటే, భవిష్యత్తులో ఉద్యోగాలకు రక్షణ ఉంటుందన్నారు. నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం, అలాంటి కోర్సులలో శిక్షణ ఇప్పించేందుకు పెద్ద ఎత్తున కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముందు చూపుతో వ్యవహరించి ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కారణంగానే, నేడు ప్రతి ఊరిలో 50 నుంచి 100 మంది వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారయ్యారని గుర్తు చేశారు. కందుకూరు నియోజకవర్గం నుంచి ఇప్పటికి 40 వేల మందికి పైగా వలసలు వెళుతున్నారని, ఇకనుంచి ఆ వలసలు ఉండవని ఎమ్మెల్యే గారు అన్నారు. వచ్చే ఏడాది నుంచి రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. 90 వేల కోట్లతో బీపీసీఎల్, 50వేల కోట్లతో ఇండోసోల్ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయని చెప్పారు. అలాగే పోర్టుకు అనుసంధానంగా ఎన్నో పరిశ్రమలు వస్తాయన్నారు. రాబోయే రెండు మూడు ఏళ్లలో నియోజకవర్గం పారిశ్రామిక హబ్ గా మారటం ఖాయమని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడుతూ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,000 టీచర్ పోస్టులు, సుమారు 6000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసిందన్నారు. గతంలో డీఎస్సీలను పరిశీలిస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాలలో 8 సార్లు డీఎస్సీలు నిర్వహించి, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులను రిక్రూట్ చేశారని అన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల పైన ఎక్కువగా దృష్టి సారించారని, ఆయన సారధ్యంలో విద్యావ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలియజేశారు. త్వరలో కందుకూరులో తన సొంత నిధులతో మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇలాంటి జాబ్ మేళాలను యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు బాగు చేసుకోవాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు గాయత్రి కాలేజీ ప్రిన్సిపాల్ సి.హెచ్ రామకృష్ణ, భరద్వాజ, గీతా శ్రీనివాసరావు, శ్రీవిద్య హై స్కూల్ కరస్పాండెంట్ రమణయ్య మరియు వివిధ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *