తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
తెలుగు నాటక రంగ పితామహుడు, సహజ నటనకు ఆద్యుడు, నాటక సంస్కర్త శ్రీ తాడిపత్రి రాఘవాచార్యులు (బళ్ళారి రాఘవ) గారి జయంతి సందర్భంగా ఆదివారం ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపియస్., గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) N.యుగంధర్ బాబు గారు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో బళ్లారి రాఘవ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతూ, తెలుగు నాటక రంగంపై తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని తెలిపారు. తెలుగు నాటక రంగ అభివృద్ధికి విశేష సేవలందించిన గొప్ప రంగస్థల నటుడు బళ్లారి రాఘవ సహజ నటనకు ప్రాధాన్యతనిస్తూ, నాటకాన్ని కేవలం వినోద సాధనంగా కాకుండా సామాజిక చైతన్యాన్ని పెంపొందించే శక్తివంతమైన వేదికగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. కళను సామాజిక మార్పుకు సాధనంగా వినియోగించి, తెలుగు నాటక రంగానికి కొత్త దిశానిర్దేశం చేసిన మహనీయుడిగా బళ్లారి రాఘవను కొనియాడారు. ఆయన గొప్ప న్యాయవాది కూడా అని గుర్తు చేస్తూ, అలాంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామిరెడ్డి, ఆర్ఎస్సై తిరుపతి స్వామి,ఏ ఆర్ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.