తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
పల్లె పండుగ–3 కార్యక్రమంలో భాగంగా ఒంగోలు మండలంలో బుధవారం ఒక్కరోజే రూ.4 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఒంగోలు మండలం గుండాయిపాలెం గ్రామలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అలాగే ఉలిచి నుండి పాతపాడు రహదారిలో నిర్మించనున్న కల్వర్టుల కోసం రూ.70 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బొద్దులూరివారిపాలెం గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన నిర్వహించారు. ఉలిచి గ్రామంలో రూ.70 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు, కరవది గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే కరవది గ్రామంలో 27 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ మరియు 6.5 లక్షలతో నిర్మించిన పంచాయతీ సంత భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు.వలేటివారిపాలెం గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. అదే గ్రామంలో 30 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యంగా ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, తారురోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టని వారు, ప్రస్తుతం అభివృద్ధి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రతి గ్రామంలో అర్హత కలిగిన పేద కుటుంబాలకు ఇంటి స్థల పట్టాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి పట్టాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్రామాల్లోనే సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షులు గుండపనేని శ్రీనివాసరావు, క్లస్టర్ కన్వీనర్ నల్లమోతు గంగాధర్, మండల సీనియర్ నాయకులు పోలవరపు వెంకట రామయ్య, DMHO వెంకటేశ్వర్లు , MRO, MDO, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.