ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డా. రాయపాటి శైలజ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం జిల్లా:-
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డా. రాయపాటి శైలజ తెలిపారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.పసివయసులో మంచి, చెడుల మధ్య తేడా తెలియని చిన్నారిపై ఇలాంటి ఘటన జరగడం హృదయవిదారకమన్నారు. నిందితుడు చిన్నారి అమ్మమ్మ ఇంటికి వచ్చి రోజూ భోజనం చేసి వెళ్లే వ్యక్తి కావడంతో, కుటుంబ సభ్యులు ఇటువంటి ఘటన జరుగుతుందని ఊహించి ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఘటనకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు.ఈ ఘటనపై స్థానిక కాలనీవాసులు తక్షణమే స్పందించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించడం అభినందనీయమన్నారు. కేసులో నిందితుడికి చట్టప్రకారం శిక్ష పడేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.బాధిత కుటుంబానికి తక్షణ అవసరాల నిమిత్తం జిల్లా కలెక్టర్ ఇప్పటికే రూ.లక్ష ఆర్థిక సాయం అందించారని వెల్లడించారు. బాధిత కుటుంబానికి మహిళా కమిషన్ అండగా ఉంటుందని, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కేసు తుది దశ వరకు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.చిన్నారిని తిరిగి తీసుకురాలేకపోయినా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా మహిళా కమిషన్ తరఫున అన్ని విధాలా కృషి చేస్తామని డా. రాయపాటి శైలజ స్పష్టం చేశారు.