తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను అరికట్టడం, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పెరిదేపి గ్రామంలో, వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని పొలినేనిపాలెం గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు.ఈ సందర్భంగా గుడ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలియజేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అటువంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.అలాగే సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, అపరిచితుల నుంచి వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు వివరించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, అక్రమ రవాణాకు దూరంగా ఉండాలని, వాటికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు.ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) – ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రజల సహకారంతో నేరరహిత సమాజ నిర్మాణం, శాంతిభద్రతల పరిరక్షణ, సురక్షిత గ్రామాల ఏర్పాటు కోసం ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు.