మార్కాపురం ఆర్డీఓని కలిసి వినతి పత్రం.
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, స్థలాలు, వాగు పోరంబోకు భూములు, స్మశాన స్థలాలను సైతం వదలక ఆక్రమణదారులు యదేచ్ఛగా వెంచర్లు వేసి బహిరంగంగానే అమ్ముకొంటున్నారని, ప్రభుత్వ భూములను స్థలాలను కాపాడుతూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్, బిఎస్పి పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా జిల్లా అధ్యక్షులు రాచీటి ప్రసాదులు ఆర్డీవో ప్రభాకర్ రావును కలిసి మంగళవారం ఎర్రగొండపాలెం తాహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు ఆర్డీవోతో మాట్లాడుతూ పట్టణంలో టోల్ గేట్ దగ్గర మిల్లంపల్లి ఇలాఖాలోని సర్వే నెంబర్ 203లో అక్రమ వెంచరును, అదేవిధంగా మార్కాపురం రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద గల సర్వేనెంబర్ 555 లోని వడుపు వాగును ఆక్రమించి వేసిన వెంచరును స్మశాన స్థలాలను కూడా ఆక్రమించి వెంచర్లు వేస్తున్నారని తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. గతంలో రాళ్లవాగులోని సమస్యను కూడా గాలికి వదిలేసారని, ఎన్ని సర్వేలు చేసినా అక్రమ దారులకే వత్తాసు పలుకుతున్నారని అక్కడ సమస్యను ఇప్పటికే పరిష్కరించలేదని తెలిపారు. దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకుల అండదండలు అదేవిధంగా ప్రభుత్వ అధికారుల అనుసంధానంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని, ఆక్రమణదారులు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలు, భూముల ఏరియాలలో ఉన్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావని వారు తెలిపారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రభుత్వ స్థలాలను, భూములను, వాగు పోరంబోకు స్థలాలను గుర్తించి అన్యక్రాంతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు….