google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

చిన్నారుల భవిష్యత్తును సన్మార్గంలో నడిపించేందుకు, వారిలో ఆధ్యాత్మికత, నైతిక విలువలు మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే లక్ష్యంతో న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల ఆధ్వర్యంలో, అధ్యక్షుడు సుదర్శన్ బాబు నాయకత్వంలో టంగుటూరు పాకల రోడ్డులోని న్యూ లైఫ్ ఆరాధన మందిరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన న్యూ లైఫ్ చిల్డ్రన్ క్యాంప్ ఘన విజయాన్ని సాధించింది.
దాదాపు 200 మందికి పైగా చిన్నారులు పాల్గొన్న ఈ క్యాంప్‌లో ఆధ్యాత్మిక బోధనలు, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మక కార్యక్రమాలు, ఆటలు, పాటలు, కథలు మరియు వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులను ఉత్సాహపరిచారు.
గుంటూరు నుండి విచ్చేసిన అరుణ జ్యోతి, లీనా అన్విత, అలాగే టంగుటూరుకు చెందిన మెర్సీ ఎస్తేర్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించారు. అరుణ జ్యోతి పిల్లలకు జీవితాన్ని ప్రభావితం చేసే విలువైన సందేశాన్ని అందించగా, మెర్సీ ఎస్తేర్ ఆసక్తికరమైన కథల ద్వారా నైతిక బోధనలు చేశారు. అరుణ జ్యోతి, లీనా అన్వితలు కలిసి పిల్లలకు కొత్త పాటలు, కోరియోగ్రఫీ నేర్పించి క్యాంప్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
రిథమిక్ ప్యాడ్స్‌తో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన రియాన్ మాథ్యూ ప్రతిభకు అందరూ ప్రశంసలు కురిపించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ ప్రతిభను ప్రదర్శించారు.
క్యాంప్‌లో పాల్గొన్న ప్రతి చిన్నారికి పౌష్టికాహారంతో కూడిన స్నాక్స్, డ్రింక్స్, భోజనాన్ని నిర్వాహకులు అందించారు. అలాగే హాజరైన చిన్నారులందరికీ ప్రోత్సాహకరమైన బహుమతులు పంపిణీ చేసి వారిని అభినందించారు.
ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ, నేటి కాలంలో పిల్లలకు అవసరమైన నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందించడంలో న్యూ లైఫ్ చిల్డ్రన్ క్యాంప్ ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని, పిల్లలు రెండు రోజులలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుని ఆనందంగా గడిపారని పేర్కొన్నారు.చిన్నారుల సమగ్ర అభివృద్ధి, ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం మరియు విలువలతో కూడిన భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన ఈ న్యూ లైఫ్ చిల్డ్రన్ క్యాంప్ టంగుటూరులో విశేష స్పందనతో విజయవంతంగా ముగిసింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *