పల్లె పండుగ 3.0లో భాగంగా పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
కంభం మండలంలో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా సుమారు రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు సీసీ రోడ్లు, తారు రోడ్ల నిర్మాణ పనులకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా జంగంగుంట్ల గ్రామంతో పాటు కంభం పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి అర్బన్ కాలనీ వరకు, హజరత్ గూడెం నుంచి అంకాలమ్మ గుడి వరకు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా కందులాపురం నుంచి రావిపాడు వరకు, హజరత్ గూడెం నుంచి రావిపాటి హైవే వరకు తారు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఎన్నో ఏళ్లుగా రహదారి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, రహదారి ఇబ్బందులను తగ్గించడమే ఈ అభివృద్ధి పనుల ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కంభం మండల ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.