సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
విజయవాడలో ఘనంగా రాష్ట్రస్థాయి డా. బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి మహోత్సవం
తొలి శుభోదయం న్యూస్ అమరావతి:-
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛా విలువల స్థాపించడానికి చేసిన కృషి అపారమని, అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని, ఆయన చూపిన బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ సామాజిక న్యాయ స్ఫూర్తితో ముందుకెళ్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమం, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం శాఖా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం నవ భారత రాజ్యాంగ నిర్మాత-భారత రత్న బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి 135వ జయంతి మహోత్సవం విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. కళాక్షేత్రం ఎదురుగా ఉన్న డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం మంత్రివర్యులు ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వివక్ష విజ్ఞాన సంపదకు అడ్డంకి కాదని నిరూపించి అడ్డంకులను అధిగమిస్తూ అఖండ భారతావనికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డా. బీఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఈ రోజు సమాజంలోని ప్రతిఒక్కరూ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు అనుభవిస్తున్నామంటే అందుకు రాజ్యాంగమే కారణమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి సమాజంలోని అన్ని వర్గాలు సమానంగా ఎదిగేందుకు కృషిచేస్తున్నారన్నారు. నాణ్యమైన విద్యను అందించడంలో రాజీలేకుండా కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని దాదాపు 1,054 హాస్టళ్లు, 190 గురుకులాల్లో సౌకర్యాల కల్పనకు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని, గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. వసతులతో పాటు కొత్త భవనాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడి విద్యార్థుల్లో గతేడాది దాదాపు 60 మందికి ఐఐటీ, నీట్ సీట్లు వస్తే ఈసారి 200 మందికి పైగా సీట్లు సాధించేలా శిక్షణ అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు కేంద్రాల ద్వారా యూపీఎస్సీ సివిల్స్ శిక్షణ ఇస్తున్నామని మంత్రివర్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వివరించారు.
